పిల్లలు స్మార్ట్ ఫోన్ వాడుతుంటే చిన్న తనం లోనే అన్ని నేర్చుకుంటున్నారు అని మురిసిపోతున్నాం. మా వాడు ఫోన్ లో అన్ని ఆపరేట్ చేయడం నేర్చుకున్నాడు అని అబ్బుర పడుతున్నాం. ఫోన్ లో ఫలానా రైమ్స్ చూడకుండా ముద్ద కూడా ముట్టడు అని మురిసి పోతూ చెప్పుకుంటున్నాం. కానీ పిల్లలు స్మార్ట్ ఫోన్స్ వాడితే వచ్చే దుష్ప్రభావాలు గురించి మర్చిపోతున్నాం.
పిల్లలకు సెలవులు దొరికితే ఫోన్ పట్టుకునే కుర్చుంటున్నారు. స్కూల్ నుండి రాగానే కూడా అదే పని. తెల్లవారింది మొదలు రాత్రి పడుకునే వరకు మొబైల్ ఫోన్ లేకపోతే గడవడం లేదు. చాలా మంది పిల్లలు చేతిలో 24 గంటలు మొబైల్ ఫోన్స్ దర్శనం ఇస్తూ ఉన్నాయి.పిల్లలు చిన్న వయసు లో స్మార్ట్ ఫోన్స్ కు ఏ విధంగా బానిసలుగా మారుతున్నారో మనకు తెలిసిందే.
పెద్దల మాట ఎలా ఉన్న పిల్లలు స్మార్ట్ ఫోన్స్ వాడకం పై వైద్యులు ఎప్పటి నుండో హెచ్చరిస్తూ ఉన్నారు. పిల్లలు కు కంటి సమస్యలు చిన్నతనం నుండే మొదలు అవుతాయి అని వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. ఐతే తాజాగా పిల్లలు స్మార్ట్ ఫోన్స్ వాడడం పై సేపియన్ లాబ్స్ అనే సంస్థ విడుదల చేసిన పరిశోధనా ఫలితాలు కొత్త విషయాలు తెలియచేస్తున్నాయి.
పిల్లలు చిన్న తనం నుండే స్మార్ట్ వాడుతూ ఉంటే అది వారు పెద్ద అయ్యాక వారి మానసిక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది అని ఈ పరిశోధన తెలియ చేస్తూ ఉంది. 27,969 మంది యువకులపై ఈ సంస్థ పరిశోధన చేసి ఫలితాలను బయటపెట్టింది. చిన్న వయసు లో స్మార్ట్ ఫోన్స్ ను అలవాటు చేసుకున్న పిల్లలు మానసిక ఆరోగ్య సమస్యలు ఎదురుకుంటున్నారు అని ఈ ఫలితాలు చెప్తున్నాయి. అంతే కాదు వీరిలో ఎక్కువగా ఆత్మ హత్య చేసుకోవాలి అనే భావన, ఎవరిమాట వినకుండా మొండిగా ఉండడం వంటి లక్షణాలు తో పాటు వీరు అందరికీ అతీతులు అనే భావన వీరిలో ఎక్కువగా ఉంటుంది అని పరిశోధన ఫలితాలు చెప్తున్నాయి. ఈ లక్షణాలు మగ పిల్లలు లో కంటే ఆడపిల్లలో అధికం గా ఉన్నట్టు ఈ పరిశోధన తెలియచేస్తూ ఉంది.
అదేవిధంగా యుక్త వయసు వచ్చాక మొబైల్ వాడడం మొదలుపెట్టిన వారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండడం, అందిరితో స్నేహం గా ఉండడం వంటి లక్షణాలు కనిపించాయి ఈ పరిశోధన చెప్తూ ఉంది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో ఇదే విధమైన ఫలితాలు వచ్చాయి.
ఇప్పుడు ఈ ఫలితాలు మనల్ని పిల్లల మొబైల్ ఫోన్ వాడకం పై మరోసారి ఆలోచించేలా చేస్తున్నాయి. పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ దూరంగా ఉంచాలి అని ఈ పరిశోధన చెప్తూ ఉంది.
పిల్లలు మాట వినకపోయిన, అన్నం తినకపోయినా మొదట వారి చేతిలో మొబైల్ ఫోన్స్ పెట్టడం వారికి అలవాటు చేస్తున్నాం. వారికి ఓపికగా చెప్పే ఓపిక కూడా నేటి తల్లితండ్రులు కు చాలా మందికి ఉండడం లేదు.
చిన్నతనం నుండి కంటి సమస్యలు నేటి పిల్లల లో గమనిస్తూనే ఉన్నాం. గతం లో పిల్లలు ఆరుబయట ఆటలు ఆడుకునే వారు. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ లో గేమ్స్ మాత్రమే ఆడుతున్నారు. పిల్లలు పార్క్ లో కూర్చుని కూడా స్మార్ట్ ఫోన్స్ లో గేమ్స్ ఆడుతున్న వారు ఉన్నారు. దీనివలన శారీరక వ్యాయామం కూడా ఉండడం లేదు. దీనితో ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. స్మార్ట్ ఫోన్స్ లో గేమ్స్ ఆడి మానసిక రోగుల గా తయారైనా పిల్లల గురించి వింటూనే ఉన్నాం. అలాగే తెలిసి తెలియని వయసు లో తల్లితండ్రులు కు తెలియకుండా స్మార్ట్ గేమ్స్ కోసం డబ్బులు చెల్లించి పోగొట్టుకున్న సంఘటనలు వింటూ ఉన్నాము.
మరోపక్క ఇంటర్నెట్ లో, యూట్యూబ్ లో రకరకాల కంటెంట్ అందుబాటులో ఉంటుంది. ఆ మొబైల్స్ లో పిల్లలు ఎటువంటి కంటెంట్ చూస్తున్నారు అనేది కూడా తెలియడం లేదు. వారు అవి చూడడం ద్వారా ఏమి నేర్చుకుంటున్నారో చాలామంది తల్లితండ్రులు గమనించడం లేదు.
ఇప్పడు ఈ పరిశోధన ఫలితాలు పిల్లల మానసిక ఆరోగ్యం పై కూడా స్మార్ట్ ఫోన్ ప్రభావాన్ని చెప్తూ ఉంది.
పిల్లలకు స్మార్ట్ ఫోన్ దూరంగా ఉంచడం , వారికి వీలైనంత ఎక్కువగా పుస్తకాలు చదవడం అలవాటు చేయాలి. వారికి నీతి కధలు చెప్తూ ఉండాలి. దీనివలన వారి సృజనాత్మక శక్తి పెరుగుతుంది. శారీరక వ్యాయామన్ని అందించే ఆటలు ఆడించాలి. పిల్లల మొబైల్ ఫోన్స్ వాడకం పై ఇకనైనా తల్లి తండ్రులు బాధ్యత వహించకపోతే వారి భవిష్యత్ ను మనమే చేతులారా నాశనం చేసిన వారు అవుతాం.
Comments
Post a Comment