విధ్యారంగం లో అద్భుతమైన అభివృద్ది. ప్రతీ ఏడాది గొప్ప గొప్ప ఫలితాలు. 100% పాస్ అయిన స్కూల్స్ ఎన్నో. చాలా మంచి విషయమే. కానీ ఇది అంతా నాణానికి ఒకవైపే. మరోపక్క తల్లి తండ్రులకు, విధ్యార్థులు కు వస్తున్న మార్కులతో, పెర్సంటేజ్ లతో సంతృప్తి ఉండడం లేదు. 9.9 వచ్చిన విధ్యార్థులు, తల్లి తండ్రులు కూడా అసంతృప్తి తో రగిలి పోతున్నారు.
![]() |
మార్కులు ఒక్కటే జీవితం కాదు |
ఈ ఏడాది ఈ అసంతృప్తి కి లోనై బలవంతం గా ప్రాణాలు తీసుకున్న విధ్యార్థులు ఎంతో మంది ఉన్నారు. పరీక్షలలో సరైన మార్కులు రాలేదని, పక్కవాడి కంటే తక్కువ వచ్చాయి అని, పరీక్షలలో ఫెయిల్ అయ్యామని, తక్కువ మార్కుల వలన తల్లితండ్రులు మందలించారు అని ఇలా కారణం ఏదైనా కానీ ఫలితం మాత్రం బలవంతపు మరణమే.
కుమారుడు కు పదవ తరగతి ఫలితాలు లో 9.5 వచ్చి నా, తల్లి మొహం లో విచారం చూసి ధైర్యం చెప్పి , ఐనా మంచి మార్కులే వచ్చాయి కదా అని అంటే, ఏమి మంచి మా చిన్నప్పటి చదువులు కాదు కదా 10/10 రావాలి అని ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. అంతే కాదు మా బందువులలో చాలా మందికి ఇంకా మంచి మార్కులు వచ్చాయి అని కుమిలి కుమిలి బాధ పడింది. ఆ తల్లి బాధ చూసి తట్టుకోలేక ఆ విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నం చేసాడు. చివరి నిమషం లో కుటుంబ సభ్యులు చూడడం తో ప్రాణం నిలబడింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
బంధువులు తో గొప్పగా చెప్పుకోవడానికో, భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు రావు ఏమో అని బెంగ తోనే మార్కులు తోనే పరిగెట్టేలా పిల్లలపై ఒత్తిడి తెచ్చి చదివించి తీరా కొద్ది గా తక్కువ వస్తే పరువు పోయినట్టు ఫీల్ అవుతున్న చాలా మంది తల్లితండ్రులు చివరకి వాళ్ళు బలవంతం గా ప్రాణాలు తీసుకోవడమో, ఆ ఒత్తిడి పిల్లలు పై పెట్టి వాళ్ళు ప్రాణాలు తీసుకోవడానికి పరోక్షంగా గా కారణం అవ్వడమో చేస్తున్నారు. ఈ మార్కుల ఒత్తిడి తో పక్కవాడి మార్కుల తో పోల్చుకుని ఆత్మ నున్యత తో ప్రాణాలు తీసుకుంటున్న పసివారు ఉన్నారు..
ఈ పోటీ ప్రపంచం లో మార్కులు చాలా ముఖ్యం కానీ ఆ పసివాళ్ళు బతికి ఉన్నపుడు కదా! ఈ ప్రాణమే లేకపోతే ఈ మార్కులు, ఈ గొప్పలు ఉండి ఏం ప్రయోజనం.
అసలు లోపం ఎక్కడ ఉంది?
కేవలం మార్కులు మాత్రమే జీవితం అనుకునే తల్లి తండ్రులు నుండి, ఒకటి, ఒకటి, ఒకటి అంటూ ప్రచారాలు చేసే కార్పొరేట్ విద్యాసంస్థలు దాక, అందరికీ ఈ పాపం లో భాగం ఉంది. మార్కులు ఒక్కటే జీవితం కాదు అని చెప్పాల్సిన విద్యా సంస్థలు ను నేడు వేళ్లపై లెక్క పెట్టవచ్చు. ఒకవేళ విద్యాసంస్థలు ఆలా చెప్తే వాటిని దూరం పెట్టే తల్లి తండ్రులు ను చూడవచ్చు.
సమాజం లో గొప్పలు చెప్పుకోవడం, మా వాడికి ఇన్ని వచ్చాయి. వాడు అక్కడ సెటిల్ అయ్యాడు. వాడికి ఇంత ప్యాకేజీ అని గొప్పగా బంధువుల దగ్గర చెప్పుకునే తల్లితండ్రులు ను చూసి ఓహో, మా వాడు కూడా అలాగే ఉండాలి, మేము అలానే చెప్పుకోవాలి అని ఆరాటపడే తల్లి తండ్రులు ఉన్నంతకాలం ఈ ఆత్మహత్యలు ఆగుతాయి అనే నమ్మకం లేదు.
పిల్లల భవిష్యత్ గురించి కలలు కనడం తప్పుకాదు. వారిని ఆ మార్గం గుండా నడిపించడం కూడా తప్పు కాదు. కానీ మార్కులు తక్కువ వస్తేనో ఒక్కసారి పరీక్ష ఫెయిల్ అయ్యితే నో ఎదో ఘోరం జరిగి పోయినట్టు దిగులు గా తీవ్ర మానసిక ఒత్తిడి కి లోనై ప్రాణాలు తీసుకోవడం మాత్రం ఘోరం.
మొదట పిల్లలకు ధైర్యాన్ని ఇవ్వాల్సింది, వారిని అర్ధం చేసుకోవలసింది తల్లి తండ్రులు మాత్రమే. మార్కులు తక్కువ వచ్చినా, ఫెయిల్ అయ్యినా మానసికం గా వారికి తోడుగా నిలవాల్సింది తల్లితండ్రులే. ఒక్కసారి ఫెయిల్ అయితే మళ్ళీ చదవచ్చు. మళ్ళీ పరీక్ష రాయచ్చు. చావు ఒక్కటే మార్గం కాదు. పిల్లలు ఐనా తల్లి తండ్రులు ఐనా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఇది.
నేటి విద్యార్థులలో చాలా మందికి మొదటి సారి విజయం సాధించక పోతే జీవితం అంతా వృధా అనే ఆలోచనా విధానం, ఇక జీవితం లో అంతా కోల్పోయినట్టే అనే ఆలోచనలు చాలా చాలా ఉంటున్నాయి. మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసే ఓపిక కానీ, ఫెయిల్ ఐతే ఏమవుతుంది అనే ఆలోచన కానీ రావడం లేదు. ఈ సవంత్సరం మన తెలుగు రాష్ట్రాలలో ఇంటర్మీడియట్ ఫలితాలు తర్వాత ఆత్మ హత్య చేసుకున్న విద్యార్థులు సంఖ్య చూస్తుంటే మనము విద్యారంగం లో సాధించింది అభివృద్దా? అనే అనుమానం కలుగుతుంది.
జీవితం లో పయనించడానికి మార్కులు ఒక్కటే కాదు అని ఈ పసివారికి చెప్పడం లో మనము అంతా ఫెయిల్ అయ్యాము. ఫెయిల్ అయితే మళ్ళీ రాసి పాస్ అవచ్చు అని ధైర్యం చెప్పడం లో మనం ఫెయిల్ అయ్యాము. తల్లి తండ్రులుగా మంచి జీవితం కోసం కార్పొరేట్ కాలేజీ లో నో, స్కూల్ లోనే చేర్పించి ఆనంద పడి మార్కుల తక్కువ వచ్చాయి అని, లక్షల ఫీజు వృధా ఐయింది అని బాధపడి పిల్లల పై ఒత్తిడి పెంచి వాళ్ళ కి అదే బంగారు భవిష్యత్ లేకుండా చేయడం లో మాత్రం పాస్ అయ్యాము.
పాఠ శాలలలో టీచర్స్ ఒక్క మార్కు తక్కువ వేసినా.... తల్లితండ్రులు టీచర్స్ ను నీలదీస్తారు. వాడికి మార్కులు ఎందుకు తక్కువ వేశారు అని కుశల ప్రశ్నలు వేస్తారు. పక్క పిల్లల తో పోల్చి చూస్తారు. పిల్లవాడి తెలివి తేటలు, విజ్ఞానం అనవసరం మార్కులు మాత్రమే కావాలి. కార్పొరేట్ స్కూల్స్ కూడా అందుకే పిల్లల కు మార్కులు మాత్రమే ఇస్తున్నాయి. జీవితం లో బతకడానికి కావాల్సిన ధైర్యం ఇవ్వలేక పోతున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే పిల్లలకు మార్కులు రావచ్చు ఏమో కానీ భవిష్యత్ లో ఏ చిన్న సమస్య వచ్చినా తట్టుకునే ధైర్యం మాత్రం రాదు. తల్లి తండ్రులు ఒక్కసారి ఆలోచించండి! మార్కులు కన్నా ప్రాణాలే విలువైనవి. మన గొప్పలు కన్నా ప్రాణాలే విలువైనవి.
Comments
Post a Comment